Pankaj chowdary: రాజధాని కోసం రూ. 6700 కోట్లు బ్యాంకు ఋణం సమీకరించాం 1 y ago

featured-image

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకొనే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంక‌జ్ చౌద‌రి పేర్కొన్నారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించామని ఆయన తెలిపారు. నూతన రాజధాని అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, సచివాలయం, రాజ్ భవన్ లో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మొత్తం ఇచ్చింది? భవిష్యత్తులో ఏమైనా అదనపు మొత్తం కేటాయించే ప్రణాళిక ఉందా? అని సోమవారం లోక్ సభలో వైకాపా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించారు. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందా? నెరవేర్చి ఉంటే.. అది ఏపీ ఎస్ఆర్ఎం పరిధిలోకి వస్తుందా? అని ఎంపీ గురుమూర్తి అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలకు పంక‌జ్ చౌద‌రి సమాధానమిచ్చారు.

రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.2,500 కోట్లు అందజేసిందని అన్నారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత, సుస్ధిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.6,700 కోట్ల చొప్పున బహుపాక్షిక రుణాన్ని ఆమోదించడానికి, సంతకం చేయడంలో కేంద్రం సహాయం చేసిందని తెలిపారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలో ముఖ్యమైన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ రుణసాయం వినియోగించుకోవచ్చు.

ప్రపంచబ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి తీసుకొచ్చాము. కాగా ఈ రుణాల పంపిణీ ఇంకా జరగ లేదు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో గరిష్టంగా రూ.1,500 కోట్లు (10 శాతము) మించకుండా ప్రత్యేక సాయంగా ఆంధ్రప్రదేశ్ కు కౌంట‌ర్ పార్ట్ ఫండింగ్‌ సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు అందిస్తున్న రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రుణపరిమితిలో లెక్కించ కూడదని నిర్ణయించాం అని పంక‌జ్ చౌద‌రి స్పష్టం చేశారు.

 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD